Rajya Sabha: ఈనెల 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు .. 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక..

డిప్యూటీ చైర్మన్‌గా మళ్లీ హరివంశ్‌!

Update: 2026-04-14 01:30 GMT

ఈనెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు ఎంపీలకు విప్ జారీ చేశాయి. మూడు రోజులు సభకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్ 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగియడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. అయితే తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. ఇక హరివంశ్ ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ఏప్రిల్ 17న ఎన్నిక చేపట్టనున్నారు. అయితే డిప్యూటీ ఛైర్మన్ రేసులో మళ్లీ హరివంశ్ పేరు వినిపిస్తోంది. తిరిగి ఆయన్నే ఎన్నుకుంటారా? లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇక 2019 నుంచి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పటికీ.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించడంలో అధికార పార్టీ చూపుతున్న ఆత్రుతపై కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ నియామకాన్ని ప్రభుత్వం బలవంతంగా చేయించాలని చూస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ‘‘ఏడేళ్లుగా లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ను నియమించని ప్రభుత్వం.. నాలుగు రోజుల లోపే రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ నియామకాన్ని బలవంతంగా చేయించాలని చూస్తోంది.’’ అని అన్నారు.

Tags:    

Similar News