Mumbai rain: ముంబైకి వచ్చే 24 గంటల పాటు రెడ్ అలర్ట్

ఉత్తరాదిలో వర్ష బీభత్సం;

Update: 2024-07-09 00:15 GMT

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే రైళ్లు, 50 విమానాలు రద్దు చేశారు. అలాగే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉంటే ముంబైకి కేంద్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని సూచించింది. 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పౌరసరఫరాల సంస్థ కోరింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. సహాయం కోసం మెయిన్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్ 1916కు డయల్ చేయాలని ప్రజలను కోరింది.

ఉత్తరాదిలో వర్ష బీభత్సం

కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తర భారతదేశంలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ, బీహార్‌, అస్సాం, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ ప్రజలు ప్రయాణాలు, తాగునీరు వంటి అత్యవసరాల కోసం సైతం ఇబ్బందులు పడుతున్నారు. వైమానిక, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.

కొండ చరియలు విరిగిపడుతుండటంతో సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. కొండ చరియలు విరగడంతో హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారులు సోమవారం ఓ జాతీయ రహదారితోపాటు 70కిపైగా రోడ్లను మూసివేశారు. అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్‌ పార్క్‌లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు.

జమ్ము కశ్మీరులోని పూంఛ్‌ జిల్లాలో మొఘల్‌ రోడ్డుపై భారీ కొండ చరియ విరగడంతో పూంఛ్‌, రాజౌరీ జిల్లాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా విమానాశ్రయంలో రన్‌వే ఆపరేషన్స్‌ దాదాపు గంటకుపైగా నిలిచిపోయాయి. 50 విమానాలను రద్దు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రదేశం రాయ్‌గఢ్‌ కోటలో ఆదివారం పర్యాటకులు నానా అవస్థలు పడ్డారు. సుమారు 30 మంది పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. రైల్వే ట్రాక్‌లపై భారీగా నీరు చేరడంతో పశ్చిమ, మధ్య రీజియన్‌ రైల్వే అధికారులు చాలా రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు.

Tags:    

Similar News