ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. లిక్కర్ పాలసీ కేసులో ఆగస్టు09వ తేదీన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సోమ, గురువారాల్లో విచారణాధికారి ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని సిసోడియా కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది. వారంలో 2 రోజులు హాజరవ్వాల్సిన అవసరం లేదని, ట్రయల్ సందర్భంగా కచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలంది.
సిసోడియా బెయిల్ అభ్యర్థనపై నవంబర్ 22న విచారణకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీలను స్పందించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. 22వ తేదీ విచారణలో సిసోడియా తరఫు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ, దర్యాప్తు అధికారుల ముందు సిసోడియా 60 సార్లు హాజరయినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ 2023 ఫిబ్రవరి 26న సిసోడియను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9న మనీలాండరింగ్ కింద ఈడీ ఆయనను అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ క్యాబినెట్‌కు సిసోడియా రాజీనామా చేసారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టివేశారు