Rammohan Naidu : భారత విమానయాన రంగంలో విప్లవాత్మక వృద్ధి : రామ్మోహన్ నాయుడు
ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గత 11 ఏళ్లలో భారతదేశ విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, హిండన్ విమానాశ్రయంలో దేశవ్యాప్త 'యాత్రి సేవా దివస్ 2025' కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... 2014లో కేవలం 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2025 నాటికి 25 కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు, అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ప్రతి ప్రయాణికుడిని తమ ప్రాధాన్యతగా భావిస్తున్నామని అన్నారు.
డిజిటల్ ఇండియా మిషన్'లో భాగంగా త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రామ్మోహన్ నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. కాగా హిండన్ విమానాశ్రయం గత ఐదేళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2020లో ఇక్కడి నుండి కేవలం ఒక్క విమాన సర్వీసు మాత్రమే ఉండేదని... ఇప్పుడు దేశంలోని 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఇది విమానయాన రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.