IAS Officers forced to retire : కుక్క కోసం అధికార దర్ప దర్పం
కుక్కతో వాకింగ్ కోసం స్టేడియం ఖాళీ ... ఊడిన IAS ఉద్యోగం.;
దిల్లీ స్టేడియంలో పెంపుడు కుక్కతో వాకింగ్ కోసం అథ్లెట్లను త్వరగా బయటకు పంపిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి రింకూదుగ్గాపై వేటుపడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రింకూదుగ్గాను పదవీ విరమణ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. 1994 IAS బ్యాచ్‌కు చెందిన రింకూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇండీజీనియస్ అఫైర్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది దిల్లీ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన రింకూ తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు క్రీడాకారులను నిర్ణీత సమయం కంటే ముందే స్టేడియం నుంచి పంపాలని నిర్వాహకులకు సూచించారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి రింకూ, భర్త, పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ చేయటంపై దుమారం రేగింది. దీంతో IAS దంపతులను దిల్లీ వెలుపలికి బదిలీ చేసిన ప్రభుత్వం....తాజాగా ఇప్పుడు IAS అధికారిణి రింకూపై చర్యలు తీసుకొంది.
దిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీగా ఉంటుంది. ఏడాది కిందట.. దిల్లీలో పనిచేస్తున్న ఈ ఐఏఎస్ జంట తమ పెంపుడు కుక్కతో వాకింగు చేసేందుకు స్టేడియంను ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. వీరి ఆదేశాల మేరకు స్టేడియం నిర్వాహకులు నిర్ణీత సమయం కంటే ముందే క్రీడాకారులను బయటకు వెళ్లగొట్టేవారు. ఆ తర్వాత ఈ అధికారులిద్దరూ పెంపుడు కుక్కతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగు చేసేవారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో గతేడాది మే నెలలో ప్రభుత్వం స్పందించింది. భార్యాభర్తలను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. తాజాగా ఆ ఇద్దరిలో రింకూపై వేటు వేసింది. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1994 బ్యాచ్ అధికారిణి రింకూ దుగ్గా ను ప్రభుత్వం బలవంతంగా ఉద్యోగం నుంచి సాగనంపింది. ఈ మేరకు పదవీ విరమణ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు అధికారవర్గాలు బుధవారం తెలిపాయి.