కమీషన్ ఇవ్వలేదని ఆ ఎమ్మెల్యే ఏం చేసాడంటే...
యూపీలో బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారు;
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వలేదని, ఆ ఎమ్మెల్యే అనుచరులు బుల్డోజర్‌తో రోడ్డునే తవ్వేసిన ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌నే కాదు.. ఇప్పుడు దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ నేతలు రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ తమకు కమీషన్ ఇవ్వలేదన్న అక్కసుతో ఏకంగా బుల్డోజర్‌తో రోడ్డును ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణ సంస్థ కార్మికులపై దాడికి దిగారు. దీంతో రోడ్డు నిర్మాణ కంపెనీ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. కట్రా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే వీర్‌విక్రమ్ సింగ్ అనుచరుడు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడని రమేశ్ సింగ్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం తాను ఎమ్మెల్యే ప్రతినిధినని ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణ సంస్థ ఉద్యోగులకు పరిచయం చేసుకొన్న జగ్‌వీర్ సింగ్ రోడ్డు నిర్మిస్తున్నందుకు 5 శాతం కమీషన్ ఇవ్వాలని పలుమార్లు రోడ్డు నిర్మాణ కంపెనీనిని డిమాండ్ చేశాడు.
కానీ, ఆ కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. కమీషన్ ఇవ్వలేదన్న కోపంతో ఈ నెల 2న జగ్‌వీర్ సింగ్ 15-20 మందితో కలిసి రోడ్డు నిర్మిస్తున్న కార్మికులను కర్రలతో చితకబాది బుల్డోజర్‌తో అర కిలోమీటర్ మేర రోడ్డును తవ్వేశాడు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై ప్రజా పనుల శాఖ నుంచి సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకొంటామని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ కుమార్ పాండే వెల్లడించారు. పోలీస్ బందోబస్తు మధ్య రోడ్డు నిర్మాణ పనులు తిరిగి మొదలయ్యాయని తెలిపారు. రోడ్డు తవ్వకంపై ఘటనపై ఎమ్మెల్యే వీర్‌విక్రమ్ సింగ్ స్పందిస్తూ నిందితుడు తన ప్రతినిధి కాదని, అయితే అతడు బీజేపీ నాయకుడేనని అంగీకరించారు.