Russian Woman: గోకర్ణలోని ప్రమాదకర గుహల్లో రష్యన్ మహిళ, పిల్లలు..
ఆధ్యాత్మిక ధ్యానం కోసం ఉన్నట్లు వెల్లడి..;
కర్ణాటకలోని గోకర్ణలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీసుల పెట్రోలింగ్ సమయంలో ఊహించని ఘటన జరిగింది. అక్కడ ప్రమాదకరమైన ప్రాంతంలో గుహల్లో ఓ విదేశీ మహిళ తన పిల్లలతో నివాసం ఉంటున్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. రామతీర్థ కొండపైన ఉన్న మారుమూల, ప్రమాదకరమైన గుహలో రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను పోలీసులు చూశారు. గోకర్ణ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఈ ముగ్గరు వారికి తారసపడ్డారు.
జూలై 9న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గోకర్ణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ ఆయన బృందం పర్యాటకుల భద్రత కోసం రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. వారి బృందం అడవిలోకి వెళ్లింది. అక్కడ ప్రమాదకరమైన, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఒక గుహ దగ్గర మనిషి కదలికలను వారు గమనించారు.
గుహ దగ్గరికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. వారికి రష్యన్ మహిళ తారసపడ్డారు. ఆమె పేరు నినా కుటినా. వయసు 40 ఏళ్లు. ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రేమ (6), అమా (4) కలిసి గుహ లోపల నివసిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇంత ప్రమాకరమైన ప్రాంతంలో ఒక మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో నివాసం ఉంటోందని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.
రష్యన్ మహిళను పోలీసులు విచారించారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. తాను గోవా నుండి గోకర్ణకు వచ్చినట్లు ఆమె తెలిపింది. ఆధ్యాత్మిక ఏకాంతం కోసం వచ్చినట్లు వివరించింది. పట్టణ జీవితంలోని అంతరాయాలకు దూరంగా ధ్యానం, ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా తాను అటవీ గుహలో నివసించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఆమె ఉద్దేశాలు ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, అది చాలా డేంజర్ ప్లేస్ అని, అక్కడ ఉండటం ప్రాణాలకే ప్రమాదం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు పిల్లల భద్రత గురించి వారు తీవ్ర ఆందోళన చెందారు.
రష్యన్ మహిళ నివాసం ఉన్న గుహ రామతీర్థ కొండపై ఉంది. 2024 జూలైలో అక్కడ పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. విషపూరిత పాములు, ప్రమాదకరమైన వన్యప్రాణులకు అది నిలయం. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం.
రష్యన్ మహిళకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రమాదాల గురించి తెలియజేశారు. ఆ తర్వాత ఆమెను కొండ కిందకు తీసుకెళ్లారు. ఆ మహిళ కోరిక మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు.
నీనా తన పాస్‌పోర్ట్, వీసా స్థితి గురించి వివరాలను పంచుకోవడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. అయితే అటవీ గుహలో తన డాక్యుమెంట్స్ ను ఎక్కడో పొగొట్టుకుని ఉండొచ్చని ఆమె వెల్లడించింది.
గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఆమె పాస్‌పోర్ట్, వీసా పత్రాలు లభించాయి. నీనా మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారత్ లోకి ప్రవేశించిందని తేలింది. ఏప్రిల్ 19, 2018న గోవాలోని FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది. ఆ తర్వాత ఆమె నేపాల్‌కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారత్ లోకి ప్రవేశించిందని, తద్వారా ఆమె అనుమతించబడిన వ్యవధిని దాటి అక్కడ నివసించిందని రికార్డుల్లో బయటపడింది.
వీసా ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని, ఆ మహిళ ఆమె కుమార్తెలను కార్వార్‌లోని మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న మహిళా రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. ఆ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను రష్యాకు తిరిగి పంపేందుకు వీలుగా ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ బెంగళూరులోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)తో అధికారిక సంప్రదింపులు ప్రారంభించారు. తదుపరి చర్యల కోసం ఆ కుటుంబాన్ని త్వరలో బెంగళూరులోని FRRO అధికారుల ముందు హాజరుపరచనున్నారు.