SAMEER: ఆత్మాహుతికి సిద్ధమైన సమీర్, సిరాజ్
దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక.. ప్రాణ త్యాగానికి సిరాజ్, సమీర్ సిద్ధం;
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట ఆత్మాహుతి దాడులకు వీరిద్దరు ప్లాన్ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ స్టేషన్‌లో ఏఎస్సైగా, తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
బ్యాంకు ఖాతాలపై కూపీ
ఉగ్రవాద భావజాలం కలిగిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ బ్యాంకు ఖాతాలపై పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు. సిరాజ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ ఒక ఖాతాలో రూ.42 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన బ్యాంకుల్లో ఏమైనా ఖాతాలున్నాయా..? ఉంటే అందులో ఎంత మొత్తం ఉందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్ సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందజేయాలని నగరంలోని వివిధ బ్యాంకుల అధికారులను దర్యాప్తు అధికారులు కోరారు. ఏఎస్సైగా పనిచేస్తున్న సిరాజ్ తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది. ఏడాది కిందటి వరకు కుటుంబమంతా కొత్తవలసలో నివాసం ఉండేది. ఆ తరవాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయింది. 2015 నుంచి కొత్తవలసలోని డీసీసీబీ శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడు. ఆయన తండ్రి ఖాతా మాత్రం కొత్తవలసలోనే ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు రూ.70 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు.
లాకర్ తెరిచేందుకు తండ్రి యత్నం
చట్టవిరుద్ధ కార్యకలాపాల అభియోగంపై అరెస్టై రిమాండు ఖైదీగా కుమారుడు సిరాజ్ ఉండగా లాకర్‌ను తెరిచేందుకు తండ్రి ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్లింది. అసలు అందులో ఏముంది.. వరుసగా రెండు రోజుల పాటు బ్యాంకు అధికారులను కలిసిన నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. సాధారణ దుస్తుల్లో ఖాతాదారుగా వెళ్లిన అతడితో అధికారులు కుదరదని చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు.