SEBI Chief : సెబీ చీఫ్ కు ఐసీఐసీఐ నుంచి జీతం.. పవన్ ఖేడా సంచలన ఆరోపణలు
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్‌పై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సంచలన ఆరోపణలు చేశారు. సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ.. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని తెలిపారు. ఇది ప్రజా సేవల్లో నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే జీతం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. అలాంటిది సెబీ చీఫ్ విషయంలో అలా జరగడం లేదన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంక్, ప్రుడెన్షియల్ నుంచి జీతం అందుకుంటున్నారని ఆరోపించారు. 2017-2024 మధ్య ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా అందుకున్నారని పేర్కొన్నారు. ఒక అత్యున్నత నియంత్రణ సంస్థను నడిపిస్తున్న వ్యక్తులు ఇలా జీతం అందుకోవడం సెబీ రూల్స్ కు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.