ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు జులై 28న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన పాటల కాపీరైట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు. ఇది ఇళయరాజా, సంగీత పరిశ్రమలో కాపీరైట్ హక్కుల విషయంలో జరుగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఒక కీలక మలుపు. ఇళయరాజా గత కొన్నేళ్లుగా తన పాటల కాపీరైట్ హక్కులపై పోరాడుతున్నారు. సంగీత దర్శకుడిగా తాను స్వరపరిచిన పాటలను తన అనుమతి లేకుండా ఇతరులు ఉపయోగించుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో, లైవ్ కచేరీలలో ఉపయోగించుకునే హక్కు తనకే ఉందని, ఇతరులకు కాదని ఆయన వాదన. 500లకు పైగా కంపోజిషన్లకు సంబంధించిన తన కాపీ రైట్ కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంను ఆశ్రయించారు ఇళయరాజా. అయితే ఇళయరాజా పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.