ఎన్డీయే కూటమిలో చిచ్చు రేపిన వ్యవసాయ బిల్లులు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ముందుకు తెచ్చిన వ్యవసాయ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు రేపాయి.. ఎన్‌డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లులను తీవ్రంగా..;
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ముందుకు తెచ్చిన వ్యవసాయ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు రేపాయి.. ఎన్‌డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ బిల్లు పెట్టిన చిచ్చు నేపథ్యంలో అకాలీదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కేంద్ర మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిల్లుకు నిరసనగా మంత్రి పదవిని వదులుకోవాలని అకాలీదళ్ నిర్ణయించగా.. లోక్‌సభలోనే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించి ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ సంచలనం సృష్టించారు.. పార్టీ విధానానికి కట్టుబడిన హర్ సిమ్రత్ కౌర్.. నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు. కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పనిచేస్తున్న హర్ సిమ్రత్ కౌర్ లోక్‌సభలో వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు రాజీనామా చేశారు.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఇందులో రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డులోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకువచ్చిన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే ఫార్మర్స్ అగ్రిమెంట్ అన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లు, సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బీఐకి కట్టబెడుతూ తీసుకువచ్చిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తుందని అకాలీదళ్ వాదిస్తోంది.. కేంద్ర ప్రభుత్వంతో విభేదించింది. ఈ బిల్లుల్లో అనేక అంశాలు రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
మరోవైపు ఈ బిల్లులపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన నిర్వహించారు. దీనిపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ బిల్లులను వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణల దిశగా తీసుకొచ్చినట్లు బీజేపీ సమర్థించుకుంటోంది. ఇక ఈ మూడు బిల్లుల్లో రెండింటికి లోక్‌సభ ఆమోదం తెలుపగా.. ఇవి రాజ్యసభకు వెళ్లాల్సి ఉంటుంది.. అయితే, రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలని అకాలిదళ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.