కర్నాటకలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం అవుతారని కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. సుమారు 100 మంది ఎమ్మెల్యేలు డీకేకు మద్ధతుగా ఉన్నారని సదరు ఎమ్మెల్యేలు అన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయొద్దని.. పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
అటు ఢిల్లీ నుంచి వచ్చిన రణదీప్ సుర్జేవాలా సైతం నాయకత్వంలో మార్పు లేదని అన్నారు. అయితే ఆయన స్టేట్ మెంట్ తర్వాత కూడా ఈ ప్రచారం ఆగలేదు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో డీకే శివకుమార్ సీరియస్ అయ్యారు. కేపీసీసీ చీఫ్ గా ఉన్న డీకే ఏకంగా ఇక్బాల్ కు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని హెచ్చరించారు.
ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఏమన్నారు?
‘‘నా నియోజకవర్గ అభివృద్ధి గురించి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి సుర్జేవాల్‌తో మాట్లాడుతాను. శివకుమార్ కు సీఎంగా అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో డీకేఎస్‌హెచ్ కీలక పాత్ర పోషించింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలంతా డీకేకు మద్దతు ఇస్తున్నారు. హైకమాండ్ దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది శాసనసభ్యులు మార్పు అవసరమని కోరుకుంటున్నారు’’ అని ఇక్బాల్ అన్నారు.