Delhi BMW crash: బీఎండబ్ల్యూ కారు ప్రమాదంలో నిందితురాలు షాకింగ్ స్టేట్‌మెంట్

పోలీస్ కస్టడీ కి తరలింపు

Update: 2025-09-16 05:45 GMT

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ (52) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భార్య సందీప్ కౌర్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా బీఎండబ్ల్యూ కారు ఢీకొని మృతిచెందారు. ఇక సందీప్ కౌర్ తీవ్రగాయాలు పాలయ్యారు. అయితే ప్రమాదం జరిగిన సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కానీ బాధితులను 19 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి నిందితురాలు తరలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారకురాలైన బీఎండబ్ల్యూ కారు యజమాని గగన్‌ప్రీతి కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులను దగ్గరలో ఉన్న ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లకుండా 19 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని నిందితురాలిని అడగ్గా షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనకు ఆ ఆస్పత్రి మాత్రమే తెలుసని.. కోవిడ్-19 సమయంలో తన పిల్లలను అక్కడే చేర్చినట్లు చెప్పుకొచ్చింది. వెంటనే ఆ విషయం గుర్తుకొచ్చి అక్కడికి తీసుకెళ్లినట్లు గగన్‌ప్రీతి చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు నివ్వెరపోయారు.

అయితే బాధితురాలు సందీప్ గౌర్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్త బతికే ఉన్నాడని.. దగ్గరలోనే ఆస్పత్రి ఉందని.. అక్కడికి తీసుకెళ్లమని అడిగినా గగన్‌ప్రీతి పట్టించుకోలేదని ఆరోపించింది. అలాగే బాధితురాలి కుమారుడు కూడా అదే వాదించాడు. ఉద్దేశపూర్వకంగానే దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారని.. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఉండుంటే తన తండ్రి బతికేవాడని వాపోయాడు.

నిందితురాలు గగన్‌ప్రీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఇక బెయిల్ దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబర్ 17న కోర్టు విచారించనుంది. నవజ్యోత్ సింగ్.. భార్యతో కలిసి బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

Tags:    

Similar News