Air Pollution : 500 మార్క్‌ను తాకిన గాలి నాణ్యత సూచి
కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపీ శశిథరూర్ ఆరోపణ.;
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ – ఎన్సీఆర్‌లో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజధాని ప్రాంతమంతటా గాలి నాణ్యత క్షీణించింది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగింది. మంగళవారం ఉదయం పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏక్యూఐ లెవల్స్ 500 మార్క్‌ను తాకాయి. ఇది సివియర్ ప్లస్ కేటగిరీని సూచిస్తుంది. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది. సోమవారం కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.
కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపీ శశిథరూర్ ఆరోపణ
దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రియాక్ట్ అయ్యారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు. కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. అలాగే, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకా ( బంగ్లాదేశ్ రాజధాని ) పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అని పోస్ట్ చేశారు. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదని విమర్శించారు. మిగతా సమయాల్లోనూ అంతంత మాత్రంగానే జీవనం కొనసాగించగలం అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ శశిథరూర్ ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చారు.