Kamal Haasan : రాజకీయాల్లోకి 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉండాల్సింది: కమల్ హాసన్
రాజకీయాల్లోకి తన ప్రవేశం ఆలస్యమైందని, అందుకే ఓటమిపాలయ్యానని మక్కల్ నీది మయ్యం(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ మీటింగ్‌లో పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే వచ్చి ఉంటే ఈరోజు తన పరిస్థితి వేరేగా ఉండేదని వ్యాఖ్యానించారు. తమిళులు భాషకోసం ప్రాణాలిస్తారని, సున్నిత అంశాలతో ఆడుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. పార్లమెంటులో ఈ ఏడాది తమ పార్టీ గొంతు వినిపిస్తుందని కార్యకర్తలకు చెప్పారు.
కమల్ మాట్లాడుతూ.. భాష విషయంలో తమిళులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. భాషను రక్షించుకోవడంలో వారి పోరాటాన్ని ఉద్ఘాటించారు. హిందీ అమలుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తావించారు. భాషా సమస్యలను తేలికగా తీసుకునేవారిని ఆయన హెచ్చరించారు. ‘‘భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. భాషతో ఆటలాడొద్దు. తమిళులతో పాటు వారి చిన్నారులకు సైతం తమ మాతృ భాష ఎంత అవసరమో తెలుసు. వారికి ఏ భాష ఎంచుకోవాలో స్పష్టత ఉంది’’ అని కమల్ పేర్కొన్నారు.