Supreme Court : శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక..
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడి పడిన అంశాలతో రెండ్రోజుల క్రితం సీల్డ్ కవర్లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తోంది. 2019-2024 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై గతేడాది అక్టోబర్ 10న సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర ఆహార నాణ్యత ప్రమాణాల నియంత్రణ సంస్థ అధికారులతో సుప్రీంకోర్టు సిట్ను నియమించింది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ, పోలీసులు, అధికారులు విచారణ చేపట్టారు. సిట్ అధికారులు ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. బోలేబాబా, ఏఆర్, వైష్ణవి డెయిరీల డైరెక్టర్లు, ఉద్యోగులు అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. సుబ్బారెడ్డి పీఏ అప్పన్న, ఉద్యోగులను ఇటీవల సిట్ ప్రశ్నించింది.