Uttar Pradesh : మీర్జాపూర్‌లో రైలు ఢీకొని ఆరుగురు భక్తుల మృతి
కార్తిక పౌర్ణమి స్నానం కోసం వారణాసికి ప్రయాణం
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చునార్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కార్తిక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
చోపాన్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే ప్యాసింజర్ రైలు (13309) చునార్ స్టేషన్‌లోని 4వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఆగింది. ఈ రైలులో వచ్చిన భక్తులు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని ఉపయోగించకుండా, పట్టాలు దాటి 3వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ (కల్కా మెయిల్,12311) వారిని బలంగా ఢీకొట్టింది. ఆ రైలుకు చునార్ స్టేషన్‌లో హాల్ట్ లేదు. దీంతో భక్తులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, పలువురి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారణాసి జోన్ ఏడీజీ పీయూష్ మోర్డియా ఆరుగురు మరణించినట్లు ధృవీకరించారు. ఈ ప్రమాదం కారణంగా చునార్ జంక్షన్‌లో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికారులు మృతుల వివరాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.