Supreme Court: ‘అరుదైన కేసుల్లో తప్ప బెయిల్‌పై స్టే ఇవ్వరాదు

సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి;

Update: 2024-07-13 01:30 GMT

 బెయిల్‌ ఉత్తర్వులపై యాంత్రికంగా, ఎలాంటి కారణం లేకుండా స్టేలు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు ఇందుకు మినహాయింపులివ్వాలని, యాంత్రికంగా స్టేలిచ్చి వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించడం సరికాదని పేర్కొంది. స్టేలిచ్చుకుంటూ పోతే.. రాజ్యాంగంలోని అధికరణం 21కి విలువ ఎక్కడ ఉంటుందని ఓ మనీలాండరింగ్‌ కేసులో నిందితుడి బెయిల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణపై పర్వీందర్‌ సింగ్‌ ఖురానా అనే వ్యక్తిపై కేసు నమోదయింది. ఈ కేసులో నిందితుడు పర్వీందర్‌ సింగ్‌ ఖురానాకు ట్రయల్‌ కోర్టు గతేడాది జూన్‌ 17న జారీ చేసిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. వీటిపై గత నెల 7న సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చి.. ఖురానా బెయిల్‌ను పునరుద్ధరించింది.. ‘‘నిందితుడు ఉగ్రవాది అయితే తప్ప స్టే ఇవ్వడానికి కారణం ఏముంది’’ అని హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిలిచ్చిన తర్వాత యాంత్రికంగా స్టే ఉత్తర్వులు ఇవ్వొచ్చా..? ఒక ఏడాది పాటు ఆపేయొచ్చా.. మనం ఏం సంకేతాలిస్తున్నాం’’ అని ఈ సందర్భంగా ప్రశ్నించింది.

Tags:    

Similar News