Sukhbir Badal: మరుగుదొడ్లు శుభ్రం చేయండి-మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
సిక్కుమత నిబంధనలు ఉల్లంఘించిన సుఖ్‌బీర్‌కు అకాల్ తఖ్త్ జతేదార్ శిక్ష;
సిక్కు మత కోడ్‌ను ఉల్లంఘించినందుకు సిక్కుల అత్యున్నత సంస్థ ‘‘అకల్ తఖ్త్’’ పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కి శిక్ష విధించింది. మతపరమైన తప్పులు, రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం టాయ్‌లెట్స్, వంటగదిని శుభ్రం చేయాలని ఆదేశించింది. 2015లో వివాదాస్పద డేరాగా సచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ సింగ్‌కి క్షమాభిక్ష ప్రకటించడంతో పాటు రాజకీయంగా తప్పుడు నిర్ణయాలకు గానూ మతపరమైన శిక్షను విధించారు.
అకల్ తఖ్త్ జతేదార్, గియానీ రఘ్‌బీర్ సింగ్ మరో నలుగురు ప్రధాన మతాధికారులు కలిసి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆగస్టు 30న ‘‘తంఖైయా’(మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు) ప్రకటించారు. శిక్షలో భాగంగా అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో నిస్వార్థసేవ చేయాలని సుఖ్‌బీర్ సింగ్‌తో పాటు 2015లో ఆయన కేబినెట్‌లో ఉన్న నాయకులకు సూచించారు. వాష్ రూమ్ శుభ్రం చేయడం, పాత్రలు కడగం, మతపరమైన విధులు చేపట్టడం వంటికి శిక్షలో భాగంగా ఉన్నాయి.
శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఎడి) పార్టీ చీఫ్ పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన రాజీనామాను మూడు రోజుల్లో ఆమోదించాలని అకాల్ తఖ్త్ ఆదేశాలు జారీ చేసింది. SAD వర్కింగ్ కమిటీ ఈ ఉత్తర్వును పాటించాలని, అకాల్ తఖ్త్‌కు తిరిగి నివేదించాలని సూచించబడింది. డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు క్షమాభిక్ష పెట్టడాన్ని అకల్ తఖ్త్ చాలా రోజులుగా విచారించింది. ఈ నిర్ణయం సిక్కు సమాజంలో తీవ్ర విమర్శలకు దారి తీసింది.