NEET UG 2024: ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమే సమగ్ర నివేదికకు సుప్రీంకోర్టు ఆదేశం
రీ టెస్ట్ మా చివరి చాయిస్ అన్న సుప్రీంకోర్టు;
దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ యూజీ-2024 లీకేజీ, పరీక్షలో అక్రమాల వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ యూజీ రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇచ్చే ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రీ టెస్ట్‌ను చివరి అవకాశంగా పరిగణిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. దానికి ముందు.. అసలు లీకైన పరీక్ష ప్రశ్నాపత్రం ఎంత వరకు వెళ్లింది? దాని వలన ఎంత మంది లబ్ధి పొందారు? అనే అంశాలను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని భావిస్తే, రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.
ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివరాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లను ఆదేశించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎంత మందిని గుర్తించారు? పేపర్ లీకేజీకి అక్రమార్కులు అనుసరించిన విధానం ఏంటి? అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం 38 పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
నీట్ లీకేజీ, పరీక్షలో అక్రమాల ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సీబీఐని ఆదేశించింది. రీటెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వడంపై స్పందిస్తూ ‘అక్రమాల ఆరోపణలు ఒక వ్యవస్థాగత స్థాయిలో జరిగాయా? అనేది పరిశీలించాల్సి ఉంది. అదే విధంగా ఈ అక్రమాల వల్ల పరీక్ష మొత్తం సమగ్రత దెబ్బతిన్నదా? మోసం చేసి లబ్ధి పొందిన అభ్యర్థులను నిజాయితీ గల విద్యార్థుల నుంచి వేరు చేయవచ్చా? అనే అంశాలను కూడా చూడాలి’ అని స్పష్టం చేసింది. అక్రమాలు మొత్తం పరీక్ష ప్రక్రియపై ప్రభావం చూపిన పరిస్థితుల్లో, అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులను వేరు చేసే వీలుకాని పక్షంలో రీ టెస్ట్‌కు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడింది.
ప్రశ్నాపత్రం లీకేజీ నుంచి ఎంత మంది లబ్ధి పొందారు? వారిపై తీసుకొన్న చర్యలేంటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ‘అక్రమాలకు పాల్పడిన వారిలో ఎంత మంది ఫలితాలను నిలుపుదల చేశారు? అలాంటి వాళ్లు ప్రాంతాల వారీగా ఎంత మంది ఉన్నారు?’ చెప్పాలని పేర్కొన్నది. టెలిగ్రామ్, వాట్సాప్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రశ్నాపత్రం లీకేజీ జరిగితే, అది దావానలంలా వ్యాప్తి చెందినట్టు అని అభిప్రాయపడింది. ‘పరీక్ష పవిత్రత కోల్పోతే, అప్పుడు రీటెస్టుకు ఆదేశాలు ఇస్తాం. తప్పు చేసిన వారిని మనం గుర్తించలేకపోతే, రీ టెస్ట్‌కు ఆదేశిస్తాం’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొన్నది.