Supreme Court : చందాకొచ్చర్ దంపతులకు సుప్రీం నోటీసులు

Update: 2024-09-07 12:00 GMT

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చందాకొచ్చర్‌ దంపతుల అరెస్టు అక్రమం అంటూ గతేడాది బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ విషయంపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ అప్పీల్‌ను స్వీకరిస్తూ ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ జడ్జిలు సంజీవ్ ఖన్నా, పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం కొచ్చర్ దంపతులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే కేసులో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్‌కు బెయిల్ మంజూరు చేసినందుకు వ్యతిరేకంగా వీరిపై ఏజెన్సీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది. వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో ఉన్న ఆమె రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది నిరర్థక ఆస్తిగా మారడంతో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు మంజూరు రుణంలో కోట్లాది రూపాయలను దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్‌లో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు పేర్కొంది. ఈ కేసులో చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.

Tags:    

Similar News