Manipur: హింసాత్మక ఘటనలపై.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మణిపూర్‌లోతాజా పరిస్థితులపై స్థాయీ నివేదక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.;
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.మణిపూర్‌లోతాజా పరిస్థితులపై స్థాయీ నివేదక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత సైన్యం నుంచి కుకీ తెగలకు రక్షణ కల్పించాలని ఢిల్లీలోకి చెందిన మణిపూర్ ట్రైబల్ ఫోరం వేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి పూర్తి అప్‌డెట్ సమాచారాన్ని అందజేయాలని స్పష్టంచేసింది.తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.
మణిపూర్‌లో హింసాకాండపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బూటకపు హామీలిచ్చాయని మణిపూర్ ట్రైబల్ ఫోరం తమ పిటిషన్‌లో ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను గిరిజనులు విశ్వసించడం లేదని పేర్కొంది. ఇండియన్ ఆర్మీతో ప్రజలకు రక్షణ కల్పించాలని కోరింది.కేంద్ర దర్యాప్తు కమిషన్‌పై తమకు నమ్మకం లేదని ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ చైర్‌పర్సన్‌తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.అలాగే అసోం మాజీ పోలీస్ చీఫ్ హరికృష్ణ డెకా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని తెలిపింది.హింసాకాండలో మరణించిన ప్రతి కుటుంబానికి 2 కోట్ల చొప్పున మూడు నెలల్లో ఎక్స్‌గ్రేషియా అందించాలని, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సుప్రీంకోర్టుకు ఎంటీఎఫ్ విజ్ఞప్తి చేసింది.