Supreme Court: ఉగ్ర సంస్థ ‘‘సిమి’’ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు..
పిటిషన్‌ని తిరస్కరించిన సుప్రీంకోర్టు..;
నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై విధించిన నిషేధాన్ని ఐదేళ్ల పాటు పొడిగించే ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాకలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3(1) కింద సిమిని “చట్టవిరుద్ధ సంఘం”గా ప్రకటిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ సిమి కి చెందిన మాజీ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ) ట్రిబ్యునల్ జూలై 24, 2024న ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించడానికి న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సిమిపై నిషేధాన్ని 5 ఏళ్లు పొడగించాలని కేంద్రం జనవరి 29, 2024లో నిర్ణయించిన తర్వాత యూఏపీఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. సిమిని నిషేధిత సంస్థగా ప్రకటించడానికి తగిన కారణం ఉందా లేదా అనే దానిపై తీర్పు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేశారు.
సిమిని మొదటిసారిగా సెప్టెంబర్ 2001లో నిషేధించారు. నేటికి ఆ నిషేధం కొనసాగుతోంది. నిషేధాన్ని చివరసారిగా 2024లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా పొడిగించారు. ఈ సంస్థ ఉగ్రవాదానికి, మత విద్వేశాన్ని పెంచిపోషిస్తోందని, సామస్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సిమి పిటిషనర్ తరుపున వాదిస్తున్న న్యాయవాది, ఇప్పటికే 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ సిమి మాజీ సభ్యుడని చెప్పినప్పుడు, ‘‘ అయితే మీరు ఎందుకు వచ్చారు..? సంస్థనే రానివ్వండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ ఉనికిలో లేదని న్యాయవాది కోర్టుకు తెలియజేసినప్పుడు, ‘‘ అప్పుడు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?’’ అని అడిగింది. జమైత్-ఇ-ఇస్లామి-హింద్ (జెఇఐహెచ్)పై విశ్వాసంతో యువత మరియు విద్యార్థుల ఫ్రంట్ ఆర్గనైజేషన్‌గా సిమిని ఏప్రిల్ 25, 1977న అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో స్థాపించారు. అయితే, ఆ సంస్థ 1993లో ఒక తీర్మానం ద్వారా తనను తాను స్వతంత్రంగా ప్రకటించుకుంది.