Supreme Court : ఢిల్లీ పొల్యూషన్​ పై సుప్రీం ఫైర్​

Update: 2024-11-05 12:45 GMT

దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో బాణసంచా కాల్చడంపై ఉన్న నిషేధం అమలుకావడం లేదని అసహనం వ్యక్తంచేసింది. ఈ ఏడాది నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని దిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్‌కు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అలాగే వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు అందులో పొందుపరచాలని ఆదేశించింది. ‘‘టపాసులపై నిషేధం అమలు చేయలేదని వార్తలు వస్తున్నాయి. కాలుష్యాన్ని నివారించడానికి ఇదొక ముఖ్యమైన చర్యగా భావించాం. బాణసంచా అమ్మకాలు, తయారీ, వాటిని కాల్చడంపై ఉన్న నిషేధానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాల వివరాలు అఫిడవిట్‌లో వెల్లడించండి. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలు, కోర్టు ఆదేశాలు అమలు చేయడానికి తీసుకున్న చర్యల వివరాలను దిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించాలి’’ అంటూ నోటీసులు ఇచ్చింది. వాటికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారి స్థలాలను సీల్‌ చేయడం వంటి కఠిన చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది. 2025 నాటి దీపావళికైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నంకాకుండా చర్యలు ఉండాలని సూచించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఘటనలపై పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలు నవంబర్ 14లోగా తమ సమాధానాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

Tags:    

Similar News