Yamuna floods : ప్రేమ చిహ్నాన్ని తాకిన యమున
45 సంవత్సరాల్లో తొలిసారిగా తాజ్ గోడలు తాకిన యమున;
ఉప్పొంగుతున్న యమునా నది ప్రేమ చిహ్నాన్ని తాకింది. గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి ఈ సంఘటన జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్ మహల్ ఇప్పుడు నీటిలో ప్రతింబిస్తోంది.
గత నాలుగు రోజులుగా యమునా నది నీటిమట్టం తగ్గి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది అనుకున్న సమయంలోనే, మళ్లీ యమునానది మళ్ళీ పొంగింది. అకస్మాత్తుగా యమునా నీటిమట్టం పెరగడం ప్రారంభించింది. యమునానది నీటిమట్టం మళ్ళీ డేంజర్ మార్కును క్రాస్ చేసింది. దీంతో తాజ్ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ బాగ్, మెహ్‌తాబ్ బాగ్ లాంటి స్మారక కట్టడాలకు ముంపు పొంచి ఉన్నది.
ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటలకు యమునా నది నీటిమట్టం 206.01 మీటర్లకు చేరుకుందని తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున యమునా నది నీటిమట్టం 205. 48 మీటర్లు ఉండగా, అది క్రమంగా రాత్రికి మరింత పెరిగింది. దీంతో మళ్లీ యమునానది డేంజర్ బెల్స్ మోగించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హర్యానా లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందంటున్న ప్రభుత్వం, సహాయక శిబిరాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించింది.నీటిమట్టం తగ్గింది అని అనుకుని శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు వరద ప్రభావిత ఇళ్లకు తిరిగి రావద్దని గట్టిగా చెప్పింది.
పియోఘాట్‌లో మోక్షధామ్, తాజ్‌గంజ్ స్మశాన వాటికలను వరద నీరు ముంచెత్తడంతో మరణించిన ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. యమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగిన పక్షంలో తాజ్‌మహల్ ఎదురుగా ఉన్న కైలాష్ ఘాట్‌తో పాటుగా ఆ చుట్టపక్కల ఉన్న మరో 27 స్మారక కట్టడాలకు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.