Taslima Nasreen: మహిళలు వాళ్ల దృష్టిలో మనుషులు కాదు.. తాలిబాన్‌లపై తస్లీమా నస్రీన్..

మహిళా జర్నలిస్టులకు అనుమతి నిరాకరణపై వివాదం

Update: 2025-10-12 01:40 GMT

భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. "తాలిబన్లు మహిళలను మనుషులుగా పరిగణించరు, అందుకే వారికి మానవ హక్కులు నిరాకరిస్తున్నారు. వారికి మనస్సాక్షి ఉంటే, ఆ సమావేశంలో ఉన్న పురుష జర్నలిస్టులు బయటకు నడిచి రావాల్సింది" అని ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో మండిపడ్డారు. మహిళలను కేవలం ఇంటికే పరిమితం చేసి, పిల్లల్ని కనడానికి, భర్తకు సేవ చేయడానికి మాత్రమే చూడాలన్నది తాలిబన్ల భావజాలమని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులను ప్రెస్‌మీట్‌కు అనుమతించకపోవడం దారుణమని, వారికి సంఘీభావంగా పురుష జర్నలిస్టులు సమావేశాన్ని బహిష్కరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం, ఢిల్లీలోని ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ముత్తాఖీ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేవలం పురుష జర్నలిస్టులు మాత్రమే కనిపించారు. ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. ఆఫ్ఘన్ మంత్రి నిర్వహించిన ఈ ప్రెస్‌మీట్‌తో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మహిళల హక్కులపై తీవ్రమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ దేశం నుంచి భారత్‌కు వస్తున్న తొలి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇదే. అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన అక్టోబర్ 16 వరకు కొనసాగనుంది. 

Tags:    

Similar News