Arrest: ‘పహల్గాం’ ఉగ్రవాదులకు ఆశ్రయం..

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు అరెస్ట్‌;

Update: 2025-06-22 06:30 GMT

పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఇవాళ (ఆదివారం) ఉదయం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) అధికారులు అరెస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడి కేసును టేకప్‌ చేసిన ఎన్‌ఐఏ ఇప్పటివరకు 2000 మందికి పైగా సాక్షులను విచారించింది. వారిలో పహల్గాంలో గుర్రాలపై పర్యాటకులను రవాణా చేసేవారు కూడా ఉన్నారు.

వేల మంది సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ అధికారులు గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 32 ప్రాంతాల్లో సోదాలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు. వారిలో ఇద్దరు పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 22న నలుగురు ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలను, చిన్నారులను విడిచి పురుష పర్యాటకులను కాల్చిచంపారు. ఒక్కొక్కరిని పేర్లు అడుగుతూ మారణహోమం సృస్టించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒక నేపాలీ ఉన్నారు.

Tags:    

Similar News