హైదరాబాద్ పర్యటాకులకు విమానయాన సంస్థ థాయ్ ఎయిరేషియా గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ కు విమాన సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే విశాఖపట్నం సహా దేశంలోని 12 నగరాలకు థాయ్‌ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్- బ్యాంకాక్ సర్వీసును అక్టోబరు 27 నుంచి, చెన్నై-ఫుకెట్ సర్వీసును అక్టోబరు 30 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు రూ.7,390కి, చెన్నై నుంచి ఫుకెట్‌కు రూ.6,990కే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. అంతేకాదు, ప్రారంభ ఆఫర్ కింద ఈనెల 22 వరకు రాయితీ టికెట్లను ఎయిరేషియా.కామ్, ఎయిరేషియా మూవ్ యాప్‌పై విక్రయిస్తామని థాయ్ ఎయిరేషియా వాణిజ్య విభాగాధిపతి తన్సిత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చెప్పారు. హైదరాబాద్-బ్యాంకాక్ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై-ఫుకెట్ మధ్య 2024 అక్టోబరు 30- 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. భారత ప్రయాణికులు థాయ్‌ల్యాండ్ వచ్చేందుకు వీసా అవసరం లేదని, పాస్‌పోర్టు సరిపోతుందని ఆమె తెలిపారు.