DK Shivakumar : గాంధీ కుటుంబమే నాకు దైవం.. కాంగ్రెస్ వ్యక్తిగానే మరణిస్తా - డీకే
కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించటంపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యానికి గురవ్వగా, ఈ విషయంపై డీకే శివకుమార్ స్పందించారు. తాను బీజేపీని విమర్శించేందుకే ఆ పాట పాడానని, అయితే కొందరు దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడి ఉంటే, అందుకు చింతిస్తున్నానని, క్షమాపణలు చెబుతానని తెలిపారు. అయితే, ఈ క్షమాపణలు రాజకీయ ఒత్తిడివల్ల చెప్పేవి కాదని ఆయన వివరించారు.
గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ పట్ల తనకున్న నిబద్ధత తిరుగులేనిదని డీకే అన్నారు. ‘‘నేను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా, అలాగే మరణిస్తా. గాంధీ కుటుంబం నాకు దైవంతో సమానం, నేను వారి భక్తుడిని’’ అని ఆయన స్పష్టం చేశారు.
సభలో ఏం జరిగింది?
ఇటీవల చిన్నస్వామి క్రీడా మైదానంలో జరిగిన తొక్కిసలాట గురించి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినప్పుడు, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు డీకే శివకుమార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఈ సందర్భంగానే 'నమస్తే సదా వత్సలే మాతృభూమే' అంటూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనా గీతాన్ని పాడారు. ఈ చర్యతో సభలో ఉన్న బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ ఆయనకు మద్దతు తెలిపారు. ఈ గీతాన్ని సభ రికార్డుల నుంచి తొలగించరాదని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయంగా చర్చకు దారితీసింది.