1991లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సింగ్.. అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో మన్మోహన్ అస్సాంకు రావడం కొందరికి నచ్చలేదు. దాంతో ఆయన రాజ్యసభ నామినేషన్పై న్యాయస్థానంలో పిల్ వేశారు. ఆయన స్థానికుడే కాదని.. ఆయన ప్రాతినిధ్యం సరికాదని వాదించారు. దాంతో ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన అస్సాం పౌరుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. గువాహటిలోని సరుమత్రియాకు చెందిన నందన నగర్ లో రూ. 700లకు ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ చిరుమానాను అస్సాంకు మార్చు కున్నారు. తనతోపాటు తన సతీమణిని కూడా అస్సాం ఓటరుగా మార్చుకున్నారు. అద్దె ఇంటి చిరునామాతోనే ఓటర్ ఐడీ కార్డులు తీసుకున్నారు. పలుమార్లు రాజ్యసభ సభ్యుడిగా, చివరకు ప్రధానమంత్రిగా ఇలా అనేక హోదాల్లో కొనసాగినా.. ఆయన చిరునామా మాత్రం ఈ అద్దె ఇల్లే. అప్పట్లో అస్సాం ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియాకు చెందిన ఈ ఇంటికి అద్దె మాత్రం క్రమం తప్పకుండా చెల్లించేవారట. పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అద్దె చెల్లించడం మరిచేవారుకాదట. ఓసారి ఆయన పంపిన చెకు హితేశ్వర్ ఫ్యామిలీ నగదుగా మార్చుకోలేదు. దాంతో ఆయన దీనిని ప్రస్తావిస్తూ ఉత్తరం రాశారట. నగదు తీసుకోండి అంటూ మరొక చెక్ పంపాపరట. ఇది చాలా చిన్న విషయమే అయినా.. ఆయన నుంచి ఈ తరం నేర్చుకోవాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి అని సైకియా సతీమణి గుర్తుచేసుకున్నారు.