కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పనిచేస్తున్న విధానాన్ని ప్రజలు గమనించాలని, వారి ద్వంద్వవైఖరి అర్ధమవుతుందని ప్రధాని నరేంద్రమోడీ ప్రజలకు సూచించారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో పునరాలోచనలో పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహిళా శక్తి పేరుతో కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీనిపై కర్నాటక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి డి. కె. శివకుమార్ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ శక్తి పథకం అమలుపై పునరాలోచించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది. ఇదే అంశాన్ని మోడీ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మాటలను, హామీలను విశ్వసించవద్దని హెచ్చరించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ నిజస్వరూపమేంటో దీని వెల్లడైందని అన్నారు. అమలు చేయలేని, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు.