2000 సంవత్సరంలో జరిగిన ఊచకోత అమర్నాథ్ యాత్ర చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన. అనంత్నాగ్ జిల్లాలో దోడాలో ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు మారణకాండ జరిపారు. ఏకంగా మూడు రోజుల పాటు (ఆగస్టు 1 నుండి 3 వరకు) ఐదు వేర్వేరు ప్రదేశాలలో దాడులు జరిగాయి. ఇదొక సమన్వయ ఉగ్రవాద దాడి. అధికారిక లెక్కల ప్రకారం 89 మంది మరణించారు. కానీ అనధికారిక లెక్కల ప్రకారం 105 మంది మరణించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ దాడిని చరిత్రలో అమర్ నాథ్ ఊచకోతగా పేర్కొంటారు.
ఐదు దాడుల్లో మొదటిది ఆగస్టు 2న, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్ 32 మందిని ఊచకోత కోశారు. ఈ మృతుల్లో 21 మంది హిందూ యాత్రికులు, ఏడుగురు ముస్లిం దుకాణదారులు, ముగ్గురు భద్రతా అధికారులు ఉన్నారు. యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళుతుండగా ఈ ఉగ్రవాద దాడి జరిగింది. మిర్బజార్ - ఖాజిగుండ్, పండూ అచ్చబల్ లలో ఏకకాలంలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 27 మంది పౌరులు, వలస కార్మికులు మరణించారు. దోడాలోని మారుమూల గ్రామంలో జరిగిన మరొక దాడిలో 11 మంది మరణించారు. నాల్గవ దాడి కుప్వారాలోని ఒక గ్రామంలో జరిగింది. అక్కడ ఉగ్రవాదులు లొంగిపోయిన ఉగ్రవాది కుటుంబ సభ్యులను ఏడుగురు చంపారు. ఇక చివరిది ఐదవ సంఘటన దోడాలోని కయార్ గ్రామంలో జరిగింది. అక్కడ గ్రామ రక్షణ కమిటీ గస్తీ పార్టీ సభ్యుల బృందంపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో కనీసం ఎనిమిది మంది నిరాయుధ పౌరులు మరణించారు.