Venkaiah Naidu : మూడు సూత్రాలు పాటిస్తే.. సంపూర్ణ ఆరోగ్యం : వెంకయ్యనాయుడు
సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. అది మన చేతుల్లోనే ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం.. ఈ మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని ఆయన చెప్పారు. వీటిపై వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏఐజీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులే పేదల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి, తగిన సూచనలు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బోరబండ బస్తీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో భాగస్వాములైన ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యానికి, ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ నవీన్‌రెడ్డి, శిబిరంలో సేవలు అందించిన వైద్యులకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.