Tamilnadu: యూట్యూబ్ లో చూస్తూ ప్రసవం చేసిన భర్త , భార్య మృతి
మగబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే తీవ్ర రక్తస్రావం;
యూట్యూబ్ చూస్తూ ప్రసవం చేసి నిష్కారణంగా కట్టుకున్న భార్య మృతికి కారణమయ్యాడో భర్త. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం తరువాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నం చివరకు ఆమె ప్రాణాలమీదకే తెచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి తో రెండేళ్ల క్రితం వివాహమైంది. అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు. ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో, వారు ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. వైద్యపరీక్షలకు కూడా వారు వెళ్ళలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా ఆ జంట అంగీకరించలేదు. ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లను గానీ పౌష్టికాహారాన్ని కూడా తీసుకోలేదు. వారు స్వయంగా పండించిన గింజలు, ఆకు కూరలు ఆహారంగా ఆమె తీసుకొనేది. ఇక ప్రసవం కూడా సహజంగానే జరగాలి అని భావించిన ఆ దంపతులు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకునేవారు.
మంగళవారం లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్ తన యూట్యూబ్ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. దీంతో, కంగారు పడిపోయిన మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.
పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులను సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మంత్రసానులు ఇంటికొచ్చి ప్రసవం చేసేవారు. వాళ్లకు కొద్దో గొప్పో ఆ పనిలో నేర్పు ఉండేది. అయినా కానీ అప్పట్లో శిశు మరణాల సంఖ్యా ఎక్కువగానే ఉండేది. వైద్య సౌకర్యాలు పెరిగాక ఆ మరణాలు తగ్గాయి. ఇంటి దగ్గరే ప్రసవం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలూ ఉంటాయి. ఇక యూట్యూబ్‌లో ఇళ్ల దగ్గరే ప్రసవానికి సంబంధించిన వీడియోలు కుప్పలు తెప్పలుగా ఉండచ్చు కానీ వాటిని ప్రయత్నించడం ప్రమాదకరం.