Ajit Pawar: నేడు బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి
పెద్ద ఎత్తున తరలిరానున్న కార్యకర్తలు, అభిమానులు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం భౌతికకాయం విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉంచారు. వేలాది మందిగా ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. అంతిమ యాత్ర బారామతిలోని గడిమా ఆడిటోరియం నుంచి బయల్దేరనుంది. ఇక అజిత్ పవార్ మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
ఇక అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, రాష్ట్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు. వీఐపీలు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో వస్తుండగా ఎయిర్‌పోర్టుకు 100 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ సుమిత్ కపూర్ ప్రధాన పైలట్‌గా నడిపించగా, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ సహా పైలట్‌గా వ్యవహరించారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఏవియేషన్ అభ్యసించిన శాంభవి, న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొంది 2022 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీరితో పాటు పింకీ మాలి విమాన సహాయకురాలిగా విధులు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ లియర్‌జెట్ 45 విమానం (VT-SSK) ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో కూడా 2023 సెప్టెంబర్ 14న ముంబైలో ఒక విమాన ప్రమాదాన్ని ఎదుర్కోవడం గమనార్హం.
విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.