INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ..
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ;
ఇండియా కూటమి సోమవారం సమావేశం కానుంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష నేతలంతా భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. రాధాకృష్ణన్‌ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని ఎంపిక చేయాలని విపక్షం భావిస్తోంది.
వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవిని గెలిచే సామర్థ్యం ఎన్డీఏ కూటమికే ఉంది. సంపూర్ణ మద్దతు ఉంది. మిత్రపక్షాలను కలుపుకుని విజయం సాధించనుంది. అలాగే తటస్థంగా ఉండే బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతును కూడా బీజేపీ కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే ఈ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని ప్రతిపక్షం భావిస్తోంది. అంతేకాకుండా తమ ఐక్యతను కూడా చాటిచెప్పాలని ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉంది.
రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాల సాయంతో ఆ సంఖ్య 132కు చేరింది. ఇక ఏడుగురు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. వీరు కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్యా బలం 139కి చేరుతుంది. ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపి 293 మంది ఉన్నారు. దీంతో సులభంగా ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోనుంది. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టం. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టకపోతే.. ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.