ప్రైవేటు కారు వాహన యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై నేషనల్ హైవేలపై నిత్యం ప్రయాణించే కారు యజమానులకు టోల్ బాదుడు తగ్గనుంది. ఇలాంటి వారి కోసం ఏడాది పాటు చెల్లుబాటయ్యే టోల్ పాస్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. రూ.3వేలు చెల్లించి ఈ పాస్ తీసుకుంటే నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల మీదుగా ఎన్నిసార్లయినా ట్రావెల్ చేయవచ్చు. అంతేకాకుండా రూ.30 వేలు చెల్లిస్తే 15 ఏళ్ల పాటు హైవేలపై అపరిమితంగా ప్రయాణించవచ్చు.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ఈ ప్రతిపాదన ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నేషనల్ హైవేలపై ప్రయాణించే ప్రైవేటు కారు యజమానుల నుంచి ప్రస్తుతం కిలోమీటరుకు వసూలు చేసే బేస్ టోల్ రేటు ధరను తగ్గించే అలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై రోజూ ప్రయాణించే వాహనదారులకు ఒక్క టోల్ ప్లాజాకు మాత్రమే నెలవారీ పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ పాస్‌ల కోసం వాహనదారులు నెలకు రూ.340 చెల్లించాలి. అంటే ఏడాదికి రూ.4080 ఖర్చవుతుందన్నమాట.
కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల కార్ల యజమానులకు పాస్‌లు అందించే ప్రణాళికపై తన మంత్రిత్వ శాఖతో చర్చించినట్లుగా తెలుస్తోంది. 2023-24లో మొత్తం రూ.55 వేల కోట్ల టోల్ ఆదాయంలో ప్రైవేట్ కార్లు రూ.8,000 కోట్ల వాటాను కలిగి ఉన్నాయి.