మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఘటనపై మోదీ, షా ఆరా తీశారు.
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో 8-10 కోట్ల మంది ఉన్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నిన్న 5 కోట్ల మంది పవిత్రస్నానాలు చేశారన్నారు. రాత్రి మౌని అమావాస్య ఘడియలు రాగానే భక్తులు ఒక్కసారిగా బారికేడ్ల ముందుకు వచ్చారని తెలిపారు. తొక్కిసలాట జరగ్గానే అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.