Train Accident: చెన్నై శివారులో రైలు ప్రమాదం.

ఏపీకి వస్తుండగా ఘటన;

Update: 2024-10-11 23:32 GMT

తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కవరైప్పెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్‌ రైలును మైసూర్‌-దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగగా.. 12 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పలువురు ప్రయాణికులు గాయపడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పట్టాలపై ఆగివున్న సరకు రవాణా రైలును అతి వేగంతో వచ్చిన ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు అంబులెన్సులు, రెస్క్యూ వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రమాణికులను సురక్షితంగా తరలించేందుకు వీలుగా బస్సులు, తాగునీరు వంటి మౌలిక వసతులు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదం కారణంగా నెల్లూరు- చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

శుక్రవారం రాత్రి 8.27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్‌ దాటిన రైలుకు కవరైప్పెట్టై స్టేషన్‌లో మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, ఆ స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు. అనంతరం మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన రైలు.. లూప్‌ లైన్‌లో వెళ్లి అక్కడ ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. చెన్నై రైల్వే డివిజన్‌ అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు 04425354151, 04424354995 ఏర్పాటు చేశారు.


ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణికులను ఈఎంయూ రైలులో చెన్నై సెంట్రల్‌కు తరలిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అక్కడి నుంచి దర్బంగా వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఉచితంగా ఆహారం, నీళ్లు అందిస్తామని తెలిపారు.

పలు రైళ్ల దారి మళ్లింపు

రైలు ప్రమాదం కారణంగా నెల్లూరు రైల్వే స్టేషన్‌లో 2 గంటలు నుంచి బొకారో ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. మరోవైపు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ధనాబాద్‌-అల్పూజా ఎక్స్‌ప్రెస్‌(13351) రైలుని రేణిగుంట-మెల్పక్కమ్‌-కట్‌పాడి మీదుగా మళ్లించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై సెంట్రల్‌, అరక్కొణం స్టేషన్లలో రైలు ఆగదు. ఇక జబల్‌పూర్‌-మధురై (02122) రైలుని రేణిగుంట-మెల్పక్కమ్‌-చెంగల్‌పట్టు మీదుగా నడిపించనున్నారు. చెన్నై ఎగ్మోర్‌, తంబరం స్టేషన్లలో రైలును ఆపరు.

Tags:    

Similar News