తనను వేధించేందుకే 2023లో ఏపీ నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారని జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండోర్ బెంచ్‌లో సేవలు అందిస్తున్న జస్టిస్ వెంకటరమణ జూన్ 2న పదవీ విరమణ చేయబోతున్న సందర్భంగా వేసవి సెలవులకు ముందు చివరి రోజు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో మాట్లాడారు. తనను ఎలాంటి కారణం లేకుండానే బదిలీ చేశారని, దానికి వ్యతిరేకంగా ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని సుప్రీంకోర్టు కొలీజియం పరిగణనలోకి తీసుకోలేదని విచారం వ్యక్తంచేశారు. తానిప్పుడు పదవీవిరమణ చేసి వెళ్లిపోతున్నానని... ఏదేమైనా.. తనను వేధించడానికే ఆనాడు తన బదిలీ ఉత్తర్వులు జారీచేసినట్లు కనిపిస్తోందన్నారు. వారి అహంకారాన్ని చల్లార్చినందుకు తాను సంతోషపడ్డానని... దేవుడు మాత్రం ఎవర్నీ క్షమించరు. ఇప్పుడు వాళ్లూ పదవీ విరమణ చేశారు. వాళ్లు వేరే విధంగా ఇబ్బందులుపడతారు. నన్ను కలవరపెట్టాలన్న ఉద్దేశంతోనే బదిలీ చేసినా.. అది జరగలేదు. అదృష్టం కొద్దీ శాపం నాకు వరంలా మారిందన్నారు.