Anil Ambani : అనిల్ అంబానీకి మరో భారీ షాక్..రూ.1,400 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ.
Anil Ambani : రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు నుంచి నోటీసు అందగా, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు చెందిన కంపెనీల రూ.1,400 కోట్ల స్థిరాస్తులను జప్తు చేసింది. ఈ కొత్త తాత్కాలిక అటాచ్‌మెంట్‌తో కలిపి ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.9,000 కోట్ల మార్క్‌ను దాటింది.
సుప్రీంకోర్టు నోటీసు
మంగళవారం నాడు సుప్రీంకోర్టు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్‌కు సంబంధించిన కంపెనీలు, అనిల్ అంబానీకి సంబంధించి జరిగిన బ్యాంకింగ్ ఫ్రాడ్ పై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ED, CBI, అనిల్ అంబానీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
పిటిషన్, దర్యాప్తు డిమాండ్
భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో నిధుల దుర్వినియోగం, ఖాతాలలో గోల్‌మాల్ జరిగాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, CBI, ED, అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా తమ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
షేర్లపై ప్రభావం
సుప్రీంకోర్టు నోటీసు, ఈడీ చర్యల ప్రభావం అనిల్ అంబానీ కంపెనీల షేర్లపైనా స్పష్టంగా కనిపిస్తోంది. రిలయన్స్ పవర్ గత 5 రోజుల్లో షేరు 2.6% క్షీణించి, రూ. 40కి చేరుకుంది. రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీ షేరు కూడా 5 రోజుల్లో 3.7% పడిపోయి, సుమారు రూ.175 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఆరోపణలు ఏమిటి?
పిటిషన్‌లో పేర్కొన్న ప్రధాన ఆరోపణల విషయానికి వస్తే.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలైన రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ 2013-2017 మధ్య కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకు కన్సార్టియం నుంచి రూ.31,580 కోట్ల లోన్ తీసుకున్నాయి. SBI చేయించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ఈ లావాదేవీల్లో భారీ స్థాయిలో గోల్‌మాల్ జరిగినట్లు తేలింది. మూసివేసినట్లు ప్రకటించిన బ్యాంక్ ఖాతాల నుంచి కూడా లావాదేవీలు జరిగినట్లు ఆడిట్‌లో గుర్తించడం జరిగింది. ఇది ఆర్థిక వివరాల్లో పెద్ద ఎత్తున తారుమారు జరిగిందనే అనుమానాన్ని పెంచుతోంది.