Union Budget 2026 : బడ్జెట్ కౌంట్‌డౌన్ షురూ.. నార్త్ బ్లాక్‌లో ఘనంగా హల్వా వేడుక.
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026-27 తుది అంకం మొదలైంది. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ పద్దుకు సంబంధించి మంగళవారం (జనవరి 27) నార్త్ బ్లాక్‌లో సంప్రదాయబద్ధంగా హల్వా వేడుక నిర్వహించారు. ఈ వేడుక ముగియడంతో బడ్జెట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించే అధికారులంతా ఇక బయటి ప్రపంచానికి దూరంగా, నార్త్ బ్లాక్ అండర్‌గ్రౌండ్‌లో లాక్-ఇన్ అయిపోయారు. భారత కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఏటా నిర్వహించే అత్యంత కీలకమైన ఘట్టం హల్వా వేడుక. ఈ ఏడాది కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. స్వయంగా ఆమె పెద్ద కడాయిలో హల్వాను కలిపి అధికారులకు వడ్డించి, బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రతులను ముద్రించే ప్రక్రియ మొదలయ్యే ముందు ఈ తీపి వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ హల్వా వేడుక ముగిసిన వెంటనే బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే సుమారు 100 మందికి పైగా అధికారులు, సిబ్బంది లాక్-ఇన్ మోడ్‌లోకి వెళ్తారు. అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేంత వరకు వీరు నార్త్ బ్లాక్ నుంచి బయటికి రావడానికి వీలుండదు. వీరి వద్ద సెల్‌ఫోన్లు ఉండవు, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం కూడా అత్యంత పరిమితంగా, నిఘా నీడలో ఉంటుంది. బడ్జెట్ రహస్యాలు పొరపాటున కూడా బయటికి పొక్కకుండా ఉండటం కోసమే ఈ కఠినమైన నిబంధనలను పాటిస్తారు.
ఈసారి బడ్జెట్ ముద్రణ ప్రక్రియను నార్త్ బ్లాక్‌లోని పాత బేస్‌మెంట్‌కు మార్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్లో ప్రింటింగ్ ప్రెస్ సౌకర్యం లేకపోవడమే దీనికి కారణం. గత కొన్ని ఏళ్ల లాగే ఈ ఏడాది కూడా బడ్జెట్ పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉండబోతోంది. అంటే పేపర్ల వాడకం లేకుండా పూర్తిగా ట్యాబ్లెట్ల ద్వారానే ఆర్థిక మంత్రి ప్రసంగిస్తారు.
బడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం ముగియగానే ఈ యాప్‌లో అన్ని పత్రాలు, గ్రాంట్లకు సంబంధించిన డేటా, ఫైనాన్స్ బిల్లు వంటి కీలక డాక్యుమెంట్లు పీడీఎఫ్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. ఈసారి బడ్జెట్‌లో సామాన్యుల పన్ను రాయితీలు, రైతుల కోసం పథకాలు, నిరుద్యోగుల కోసం ఎలాంటి వరాలు ఉంటాయనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.