భార్య అనుమతి లేకుండా భర్త బలవంతంగా శృంగారం.. అసహజ లైంగిక చర్యలు నేరాలు కాదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆమె వయస్సు 18ఏళ్లలోపు లేకుంటే లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ఆమె అనుమతి పొందాల్సిన అవసరం భర్తకు లేదని తెలిపింది.
జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఏకసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. కేసు వివరాలు చూస్తే ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ లైంగిక చర్యలో పాల్గొన్నాడు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. అక్కడి చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. 2017లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ వార్తలు సంచలనం రేకెత్తించింది. భర్త బలవంతం శృంగారం, అసహజ లైంగిక కార్యకలాపాల కారణంగా అస్వస్థతకు గురై అనారోగ్యం క్షీణించిందని బాధితురాలు మరణ వాంగ్మూలంలో ఇచ్చారు. పోస్టు మార్టం నివేదిక కూడా అదే ధ్రువీకరించింది. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు సదరు వ్యక్తిని దోషిగా నిర్ధారించింది. అతనికి 10ఏళ్ల సాధారణ జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి పరిస్థితులను గమనిస్తే ఇది అత్యాచారం కిందకు రాదని తెలిపారు. భార్య అనుమతి లేకుండా అసహజ శృంగారంలో పాల్గొనడం నేరం కాదని తేల్చి చెప్పారు.