Delhi : ఢిల్లీని వదలని వర్షం, వరద కష్టాలు.. ఎయిర్‌పోర్టులో కూలిన పైకప్పు
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని టెర్మినల్-1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దాంతో కారులోని ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో వ్యక్తి ఉండగా, అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. క్షతగాత్రులు ప్రయాణికులా లేదా ఇతరులా అనేది తెలి యాల్సి ఉంది. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం మరోవైపు ఉంది. ఇక్కడ కూలిన భవనం పాత భవనమని, దీనిని 2009లో ప్రారంభించారని చెబుతున్నారు.
ఈ ఘటనపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి సహాయచర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. టెర్మినల్ 1 నుంచి రాకపోకలను తాత్కాలి కంగా నిలిపివేశారు. పునరుద్ధరణ పనులు అనంతరం సర్వీసులను కొనసాగించనున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయంలో టెర్మినల్ రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ. 3లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.