Salman Khan: సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో కూరగాయల వ్యాపారి అరెస్ట్

ద‌ర్యాప్తు చేసి సందేశం పంపిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు;

Update: 2024-10-24 06:30 GMT

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఇటీవల కాలంలో వరుస హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన బిగ్ బాస్ షో షూటింగ్ సమయంలో కూడా సల్మాన్ ఖాన్ భారీ భద్రత నడుమ పాల్గొన్నారు. ఈ సమయంలో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వచ్చిన మెసేజ్ పై ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. అది కూరగాయల వ్యాపారి చేసిన పని అని వెల్లడైంది. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కష్టపడకుండా తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో అతను ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, నటుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తప్పించుకోవలనుకుంటే.. రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే.. లేకపోతే.. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీకి పట్టిన గతే సల్మాన్ కు పడుతుంది. ఈ బెదిరింపుల్ని లైట్ తీసుకోవద్దని సదరు కూరగాయల వ్యాపారి హెచ్చరికలతో కూడిన మెసేజ్ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు పంపించాడు. ఆ తర్వాత తాను కావాలని బెదిరింపుల మెసేజ్ చేయలదేని.. అనుకోకుండా అలా చేశాను.. క్షమించాలని మరో మెసేజ్ పెట్టాడు. ఇక, విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. ఝార్ఖండ్ పోలీసుల సహాయంతో జంషెడ్ పూర్ కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని అరెస్ట్ చేశారు.

అయితే, ఇటీవల సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత‌ బాబా సిద్ధిక్ హత్య నేపథ్యంలో అధికారులు ఆ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్నారు. దాంతో స‌ల్లూభాయ్‌కు భద్రతను పెంచారు. అలాగే ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసి, జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రేత‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక కృష్ణ‌జింక‌ల‌ను వేటాడిన కేసు నేప‌థ్యంలో ఇప్ప‌టికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌ ఖాన్‌కు ప‌లుమార్లు హత్య బెదిరింపులు వ‌చ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో స‌ల్మాన్‌ బాంద్రా ఇంటి వెలుపల బిష్ణోయ్ ముఠాలోని అనుమానిత సభ్యులు కాల్పుల‌కు కూడా పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో కొన్ని నెలల క్రితం నవీ ముంబ‌యి పోలీసులు కండ‌ల‌వీరుడిని చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ చేసిన కుట్ర‌ను కూడా బయటపెట్టారు. అప్ప‌టి నుంచి స‌ల్లూ భాయ్‌కు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News