Rahul Gandhi : రాజ్యాంగంపై రాహుల్కు కనీస అవగాహన లేదు.. ఉపరాష్ట్రపతి కౌంటర్
మహనీయుల కృషి ఫలితంగా పవిత్రమైన రాజ్యాంగం అవతరించిందని.. కానీ, కొందరు మాత్రం దేశాన్ని విభజించాలనుకుంటున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం, దేశ ప్రయోజనాల గురించి కనీస అవగాహన, ఆలోచన లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జగదీప్ ధన్‌కడ్ పరోక్షంగా విమర్శలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడి సభల్లో భారత్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రిజర్వేషన్లతో పాటు మరికొన్ని అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ధన్‌ఖడ్ గురువారం స్పందిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.‘రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఓ వ్యక్తి శత్రువులతో చేతులు కలపడంకన్నా జుగుప్సాకరమైన అంశం ఇంకేం ఉంటుంది. నిజంగా అతడి ప్రవర్తన బాధాకరం. దేశ స్వాతంత్ర్యం, రక్షణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు. ఎందరో మహిళలు తమ భర్త, పిల్లలను కోల్పోయారు. అందరి త్యాగాల ఫలితంగా లభించిన జాతీయవాదాన్ని అపహాస్యం చేయడం కన్నా అవివేకం మరొకటి ఉండదు. దేశానికి 5 వేల ఏళ్ల నాగరికత ఉందనే విషయం ఆ వ్యక్తికి అర్థం కావడం లేదు. దేశానికి వెలుపల ఉన్న ప్రతి భారతీయుడు ఒక రాయబారిగా ఉండాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా ప్రవర్తించడం లేదు’ అంటూ పరోక్షంగా రాహుల్ పై ఘాటు విమర్శలు చేశారు.