పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి మరణించడంతో.. గ్రామస్థులు పోలీసులపై మూక దాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరాదాబాద్‌కు చెందిన సోనూ అనే వ్యక్తి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడని సమాచారం అందింది. అరెస్టు చేయడానికి పోలీసులు అతడి ట్రాక్టర్‌ను వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా సోనూ ప్రమాదవశాత్తూ ఆ వాహనంపై నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసుల వల్లే అతడు మరణించాడని ఆరోపిస్తూ వారిపై రాళ్లు రువ్వుతూ, దాడులకు పాల్పడ్డారు. పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఠాకూర్‌ద్వారా-జస్పూర్ రహదారిని దిగ్బంధించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.