ISRO : చంద్రయాన్ -3, తరువాత ఏంటి ?
సూర్యుడిపై ఇస్రో కన్ను.. ఆదిత్య L1 రాకెట్ ప్రయోగానికి సిద్ధం;
జాబిల్లి దక్షిణధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించిన ఇస్రో తదుపరి ప్రయోగాలకు సిద్ధమవుతోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1ను ప్రయోగించనుంది. 378 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్టును సెప్టెంబరులో ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమవుతోంది.
సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. ఆదిత్య-ఎల్1ను సూర్యుడు-భూమి వ్యవస్థలోని లాగ్రేంజ్ పాయింట్ ఎల్1 వద్ద మోహరించనున్నారు. భూమిని నిరంతరం పరిశీలించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసాతో కలిసి వచ్చే ఏడాది జనవరిలో నిసార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. సముద్రమట్టాలు, భూగర్భ జలం, వాతావరణానికి సంబంధించిన అనేక కీలక వివరాలను ఈ ఉపగ్రహం ఎప్పటికప్పుడు అందజేయనుంది. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు నిసార్ మిషన్ ఉపయోగపడనుంది.
అంగారక గ్రహం వద్దకు పంపే రెండో వ్యోమనౌక గురించి కూడా ఇస్రోలో విస్తృత చర్చ జరుగుతోంది. మళ్లీ ఆర్బిటర్‌ను పంపాలా లేక ల్యాండింగ్‌కు ప్రయత్నించాలా అనే విషయమై శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో అరుణగ్రహానికి ల్యాండర్‌ను పంపడానికి ఇస్రో మొగ్గు చూపొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 124 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో స్పాడెక్స్ జంట అంతరిక్ష నౌకలను ఇస్రో పంపనుంది. ఇది మానవ అంతరిక్షయానం, అంతరిక్ష ఉపగ్రహ సేవల అప్లికేషన్లను సులభతరం చేయడానికి ఉపయోగపడనుంది.