Supreme Court : 100% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు
ఈవీఎంలు నమ్మకమైనవే, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ;
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లనూ తోసిపుచ్చింది. ఏ వ్యవస్థనైనా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయమైన సంశయవాదానికి దారి తీస్తుందని హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ఏ ఇతర దేశంలోని ఎన్నికల ప్రక్రియతోనూ దీనిని ముడిపెట్టి చూడలేమని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విడివిడిగా రెండు తీర్పులు వెలువరించింది. అయితే, ఆ తీర్పుల్లో ఏకాభిప్రాయం వ్యక్తంకావడం గమనార్హం. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను ర్యాండమ్‌గా ఎంపికచేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు. అలా కాకుండా వీవీప్యాట్ స్లిప్పులు అన్నింటినీ లెక్కించాలన్నది పిటిషనర్ల డిమాండ్.
ఓటింగ్ అనంతరం వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్పును ఓటరు చేతికే ఇవ్వాలని, ఓటు సక్రమంగా నమోదైందో లేదో చూసుకున్న తర్వాత అక్కడ ఉన్న బ్యాలట్ బాక్సులో దానిని వేసేందుకు అనుమతించాలన్న పిటిషనర్ల అభ్యర్థననూ ధర్మాసనం తోసిపుచ్చింది. ఓటరు చేతికి వీవీప్యాట్ స్లిప్పు ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని, అనేక సమస్యలు వస్తాయని తెలిపింది. విదేశాల్లో మాదిరిగా పేపర్ బ్యాలట్ విధానానికే వెనుదిరిగి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలన్న వినతికీ ధర్మాసనం సమ్మతించలేదు. ఈవీఎం విధానంలోని లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదని పేర్కొంది. అయితే, మెరుగుపరచుకునేలా సూచనలివ్వక పోగా అపోహలు సృష్టించి వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా చేయడం తగదని హితవు పలికింది.కాల పరీక్షకు ఈవీఎంలు నెగ్గాయని, ఓటింగ్ శాతం పెరగడం కూడా ప్రస్తుత వ్యవస్థపై ఓటరు విశ్వాసాన్ని తెలియజేస్తోందని జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయపడ్డారు. ఈవీఎంల రాకతో పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, బోగస్ ఓటింగ్ వంటివి తగ్గిపోయాయన్నారు. ఈవీయంలు దుర్వినియోగమైనట్లు పిటిషనర్లు ఒక్క దృష్టాంతాన్నీ చూపలేకపోయారని తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షానికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై అపనమ్మకాన్ని సృష్టించినందుకు క్షమా పణ లు చెప్పాలని డిమాండ్ చేశారు.