దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతంలో కోవింద్ కమిటీ సిఫారసులకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల వాదన. పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికతో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఏర్పడి స్థానిక పార్టీలు పత్తా లేకుండా పోతాయని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీనే రాష్ట్రాల్లోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలతో స్థానిక అంశాలు, సమస్యలు మరుగునపడుతాయని చెబుతున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణతో సిబ్బంది వినియోగానికి ఖర్చు తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏక కాలంలో ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అడ్డంకులు ఉండవని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు లాజిస్టిక్ సమస్య అడ్డంకిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో పాటు 100శాతం వీవీప్యాట్స్‌ను అందుబాటులో ఉంచడం అతి పెద్ద సమస్య అని వారి వాదన. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు వస్తాయని అంటున్నారు.